Friday, 16 January 2015

పండుగ వింతశోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే

మానవేతర ప్రాణులకు 'కనుమ' పట్టాభిషేకం - సూర్యరథ ప్రస్థానానికి రంగవల్లికల 'ఇంద్రధనుస్సు'లతో స్వాగతం /వీడ్కోలు
సమాజంలో మానవేతర ప్రాణుల, ముఖ్యంగా వ్యవసాయానికి, రైతుకు సహకరించిన ప్రాణుల విశిష్టతని వివరిస్తూ, కృతజ్ఞతా పూర్వకంగా వాటిని పూజించే సంక్రాంతి మూడు రోజుల పండుగలో ముచ్చటైన మూడవ రోజు 'కనుమ' పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
దీన్నే పశువుల పండుగ అని అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. గొబ్బెమ్మల పూజ, గంగిరెద్దుల హడావుడి, హరిదాసుల రాకడ, కోడిపందాలు, ఎడ్లపందాలు, బంతిపూల తోరణాలు, కొత్త జంటల విహారాలు, ఎంతో ఆహ్లదకరంగా కనిపిస్తాయి.
ఇంతటి విశిష్టమైన పండుగ వింతశోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే పట్టుగొమ్మలు. ప్రతి ఇల్లు నూతనంగా ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో, కళకళలాడుతూ! "సంక్రాంతి" లక్ష్మీని ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇక ధనుర్మాసము ప్రారంభమైన నాటినుండి వివిధ ఆలయాలలోని అర్చకస్వాములు "సంక్రాంతి" నెలపట్టి సూర్యోదయానికి పూర్వమే మంగళవాయిద్యాలతో నదీజలాలను "తీర్ధంబిందులలో" తోడ్కొని వచ్చి విశేషార్చనలు నిర్వహిస్తారు. ఇంటిముందు కన్నెపిల్లలు కళ్ళాపులు చల్లుతూ! ప్రతిరొజు వివిధ రకాల ముగ్గులతో! సప్తవర్ణాల రంగవల్లికలను తీర్చిదిద్ది "ఇంద్రధనుస్సులను" ముంగిట చూస్తున్నట్లు భ్రమింపచేస్తారు.
మహిళలు తమదైన దీక్షతో అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది, , భక్తిపూర్వకంగా మూడు రోజుల ముచ్చటైన సంక్రాంతికి ముగ్ధ సంకేతంగా తీర్చిదిద్దినట్లు రూపొందించే కనుమ రోజు రథం ముగ్గుతో - సూర్యభగవానుని మకర సంక్రమణ ప్రవేశానికి స్వాగతం పలుకుతూ, తమ ముంగింట్ల ముందుగా సాగే సూర్య రథ ప్రస్థానానికి స్వాగతాలు, వీడ్కోలు సమాంతరంగా పలికేలా సాదృశ్య రమణీయ రంగవల్లుల సన్నివేశం అలరిస్తుంది. ఆ సన్నివేశాలకి వీక్షణయోగంతో పరవశింపడమే నేటి పండుగ పరమార్థం.
సంక్రాంతి - కనుమ పర్వదినాన సర్వులకూ శుభాకాంక్షలు.

No comments:

Post a Comment