భయపెడుతున్నట్లే ఉంటుంది. దాంతో వాటిని పక్కన పడేస్తాం. వాస్తవానికి మనిషిని సద్వర్తనలోకి నడిపించాలంటే భయం కూడా అవసరమే. అందుకే మన పెద్దలు అంతగా భయపెట్టారు. గరుడ పురాణంలో అన్నీ ఇలాంటి విషయాలే ఉంటాయి. మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇవిచేయకూడదా..? కొన్ని విషయాలను పాపాలని గరుడపురాణం చెబుతోంది. అవి... బ్రహ్మహత్య, శిశుహత్య, గో హత్య, స్త్రీ హత్యలతోబాటు గర్భపాతం చేసేవారు, రహస్యంగా పాపపు పని చేసేవారు, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ, శిశు ధనం హరించేవారు కూడా నరకంలో శిక్షలను అనుభవించక తప్పదంటుంది. అలాగే అప్పు తీర్చనివారు, పర ద్రవ్యాన్ని అపహరించేవారు, విశ్వాస ఘాతకులు, ఇతరులను హత్యచేసే వారు, దోషులను పొగిడేవారు, మంచివారిని నిందించేవారు, ఋణగ్రస్థులను ఎగతాళి చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయనివారు కూడా పాపులేనట. పుణ్యతీర్థాలను, సజ్జనులను, సత్కర్ములను, గురువులను, దేవతలను నిందించేవారు యమలోకంలో దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుందట. పురాణాలను, వేదాలను, మీమాంస, న్యాయశాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు, ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటివారు దుఃఖిస్తుంటే ఆనందించేవారు, చెడుమాటలు పలికేవారు కూడా దుర్గతుల పాలు కాక తప్పదు. పెద్దల హితోపదేశాన్ని వినని వారు, ఆత్మస్తుతి, పరనింద చేసేవారు, అధర్మ మార్గంలో నడిచేవారు ఒకరకానికి చెందిన వారైతే ఇంకా నీచమైన పనులు చేసేవారు మరికొందరున్నారు. అంటే... తల్లిదండ్రులను, గురువును, ఆచార్యులను అవమానించేవారు, భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు, ఏదైనా ఇస్తానని మాట తప్పినవారు, ఇచ్చినదానిని తిరిగి తీసుకునేవారు, దానం ఇచ్చి, బాధపడేవారు వైతరణిని దాటక తప్పదు. దానం చేసేవారిని ఇవ్వవద్దని ఆపేవారు, యజ్ఞవిధ్వంసకులు, హరికథకులకు విఘ్నం కలిగించేవారు, పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమిని ఆక్రమించేవారు, పశువులకి మేత లేకుండా చేసేవారు, పశుహత్య చేసేవారు... యమలోకంలో దక్షిణమార్గాన ఉన్న వైతరణిలో కూలబడవలసిందేనట. యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరణిలో తోసి వేస్తారట. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, వంచన చేసి ధనం సంపాదించేవారు, దొంగతనం చేసేవారు, పచ్చని చెట్టను నరికేవారు, ఫలవృక్షాలను పూలతోటలను ధ్వంసం చేసేవారు, తీర్థయాత్రలను చేసేవారికి ఆటంకం కలిగించేవారు, వితంతువులను మోసం చేసి మానహరణ చేసేవారు వైతరణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగచెట్టుకు కట్టబడి యమభటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారని గరుడపురాణం చెప్తుంది. అంటే గరుడపురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవడం వల్ల మనిషి తన జీవితాన్ని మంచిమార్గంలోకి మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే... బలహీన మనస్కులు దీనిని చదవడం వల్ల చలించి పోతారని, అందువల్ల ఎప్పుడైనా మృతి సంభవించిన సమయంలో మాత్రమే గరుడపురాణాన్ని చదవాలని పెద్దలు చెప్పారు. కానీ, గరుడపురాణం ఇంటిలో ఉండటం కూడా మంచిది కాదని జరిగే ప్రచారాలలో ఏమాత్రం యథార్థం లేదని పండితులు చెబుతున్నారు.
source sakshi
source sakshi
No comments:
Post a Comment