Friday, 16 January 2015

. శాంతి వల్ల అంతా సందేహమే......"

హస్తినాపురం లో ద్రోణాచార్యుని వద్ద పాండురాజు కుమారులూ, దుర్యోధనాదులూ చదివే రోజుల్లో 
ఒకరోజు సాయంకాలం వేళ వాహ్యాళి నుంచి వస్తూ అర్జునుడు కర్ణుని చూసి " ఏం కర్ణా! 
సమరం మంచిదా? శాంతి మంచిదా? " అని అడిగాడు. ( ఇది మహాభారతం లోని ఒక ఉప కధ;
శాస్త్ర ప్రమాణం కలది; వట్టి అభూత కల్పన కాదు. ) 
' శాంతి మంచిది ' అన్నాడు కర్ణుడు. కారణం? అని కిరీటి అడిగాడు.
' ఏమోయ్ అర్జునా, యుద్ధం కనుక వస్తే, నేను నీతో పోరాడాలి. అందువల్ల నీకు ఇబ్బంది నాదేమో
జాలి గుండె. నీకు కనక కష్టం కలిగితే నేనది చూసి సహించలేను. కనక మన ఇద్దరికి కష్టం కలుగుతుంది. అందువల్ల శాంతి మంచిది' అని కర్ణుడు చెప్పాడు.
అర్జునుడు ఇలా అన్నాడు " కర్ణా! మన ఇద్దరిని మనస్సులో ఉంచుకుని నేనీ విషయం అడగలేదు
సాధారణంగా లోకంలో యుద్ధం మంచిదా? శాంతి మంచిదా? అని అడిగాను"
ఉమ్మడి విషయాలను గురించి ఆలోచించడం లో నా కంతగా అభిరుచి లేదు - అని బదులు చెప్పాడు కర్ణుడు.
వీణ్ణి చంపి పారేయ్యాలని అర్జునుడు తన మనస్సులో అనుకున్నాడు. ఆ తర్వాత అర్జునుడు
ద్రోణాచార్యుల వద్దకు వెళ్లి అదే ప్రశ్న అడిగాడు. " కలహం మంచిది " అన్నాడు ద్రోణుడు.
'ఎందుకు ? ' అని పార్ధుని ప్రశ్న. అప్పుడు ద్రోణాచార్యుల వారు " నాయనా విజయా! కలహం వల్ల
ధనము, కీర్తీ కలుగుతాయి. లేకుంటే మరణం కలిగుతుంది. శాంతి వల్ల అంతా సందేహమే......"
ఆ తర్వాత అర్జునుడు భీష్మాచార్యులవారి వద్దకు వెళ్ళాడు.
"తాతయ్యా! పోరు లాభమా? పొందు లాభమా? " అని అడిగాడు. అప్పుడా వృద్ధుడు ఇలా బదులు
చెప్పాడు. " బిడ్డా, అర్జునా! శాంతే మంచిది యుద్ధం వల్ల మన క్షత్రియ కులానికి లాభం ఉంది ;
అయితే శాంతి వల్ల లోకానికే లాభం."
' మీ మాట న్యాయసమ్మతంగా లేదు ' అన్నాడు అర్జునుడు. ' మొట్టమొదట కారణం చెప్పి,
ఆతర్వాత నిర్ణయాన్ని చెప్పాలి అర్జునా' అన్నాడు వృద్ధుడు. .......... "తాత గారూ, శాంతి వల్ల
కర్ణుడేమో పై మెట్టు లోను నేనేమో కింది మెట్టులోను ఉన్నాము. యుద్ధం కనక వస్తే నిజం
బయట పడుతుంది " అన్నాడు అర్జునుడు.
అందుకు భీష్మాచార్యులవారు, " నాయనా, ఎప్పుడు ధర్మానిదే పై చెయ్యి. యుద్ధం ఉన్నప్పుడు కాని లేనప్పుడు కాని ధర్మమే జయిస్తుంది. అందువల్ల నీ మనసులో కోపం చంపుకుని
శాంతిని కోరుకో, మానవులందరు తోడబుట్టినవారు, వారు పరస్పరం ప్రేమించుకోవాలి.
ప్రేమ తారకమంత్రం. ముమ్మాటికి చెబుతున్నాను ప్రేమే తారకమంత్రం" అన్నాడు ఆయన
కళ్ళు చెమ్మగిల్లాయి.
కొన్నాళ్ళ తర్వాత వేదవ్యాసులవారు హస్తినాపురానికి వచ్చారు. అర్జునుడు ఆయన్ని
సమీపించి " యుద్ధం మంచిదా? శాంతి మంచిదా? " అని ప్రశ్నించాడు.
'రెండూ మంచివే, సమయానికి తగినట్లుగా వ్యవహరించాలి' అని ఆయన చెప్పారు.
చాలా సంవత్సరాల తర్వాత మాట వనవాసం, అజ్ఞాత వాసం చేసే రోజుల్లో దుర్యోధనాదుల
వద్దకు రాయభారం పంపించేందుకు ముందు అర్జునుడు శ్రీ కృష్ణుడ్ని సమీపించి " యుద్ధం
మంచిదా? శాంతి మంచిదా? " అని అడిగాడు.
అందుకు కృష్ణుడు - " ప్రస్తుతానికి శాంతి మంచిది, అందువల్లనే నేను శాంతి కోసమని
హస్తినాపురానికి బయలుదేరుతున్నాను" అన్నాడట !

No comments:

Post a Comment