Friday, 16 January 2015

రామోజీరావు ను కేసీఆర్ యెందుకు మెచ్చుకున్నడు.?

రామోజీరావు ను కేసీఆర్ యెందుకు మెచ్చుకున్నడు.?
ఉద్యమకారులతోని అయితదా.?
తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడే కాదు..తెలంగాణ వచ్చినంక గూడా..మనముందట అనేక యక్ష ప్రశ్నలు ఆటికి జవాబులు యేలాడుతున్నయి. సెప్టెంబర్ 17 యేం దినం.?విద్రోహమా విమోచనమా విలీనమా.? అది తేలకముందే...నిజాం రాజు మంచోడా చెడ్డోడా.? అదట్టుండంగనే తెలుగుతల్లి కాదు తెలంగాణ తల్లే మనది...అట్లా మొదలయిన ప్రశ్నల పరం పర..యీ యాల రామోజీరావు దగ్గర వచ్చి ఆగింది.రామోజీ ఫిల్మ్ సిటీ భూముల సేకరణలో అక్రమాలు జరుగలేదని కేసీఆర్ అనడం..కటర్ పంత్ తెలంగాణ ఉద్యమకారులకు కోపాన్ని తెప్పించింది.కేసీఆర్ మీద అభిమానం వున్న మా దోస్తు ఒకాయన..‘యేందన్నా..నిజాం మంచోడంటే సరేతీయ్ అది వొడిసిన కత గాబట్టి యెందుకు గెలకాలెలే అనుకోని సప్పుడుచేయలేదు..యిప్పుడు రామోజీరావు గూడా మంచోడంటే వూకుందామా.?నువ్వు గూడ సప్పుడు చేత్తలేవేందే.?’’ అని నామీద యిరుసుక పడ్డడు.
నేను యేం సప్పుడు చేయలే..
నిజమే..యియ్యాల బాధపడుతోల్లంతా ఉద్యమకారులు హ్రుదయం వున్నోల్లు.. తెలంగాణ బిడ్డలు మనుసు గల్లోల్లు.అందుకే శత్రువు అని యిన్నాల్లూ భావించిన వాడికి క్లీన్ చీట్ యిచ్చుడేంది అని ఆల్లకు కోపం వచ్చింది.అందుకే యెమ్మటే అట్ల స్పందించిండ్రు. ‘‘ మన తెలంగాణ ను ఆఖరిదాన్క అడ్డుకున్న రామోజీ రావు అసొంటి దొంగలు యియ్యాల మంచోల్లు యెట్లయితరు.ఆల్లను యెట్టగూడ వదులొద్దు. కాళోజీ అన్నట్లు ‘‘ కాలమ్ము రాగానే కాటేసి తీరాలె’’ అని తీర్మానం చేసుకోని కేసీఆర్ మీద గుర్రు మీదున్నరు.
నిజమే కదా...మరి యేం జెయ్యాలె.యీ పెద్దమనిషి యెందుకిట్లన్నడు..అని లోతుగ తొవ్వితే...
లవ్వు చేస్తున్నప్పుడు కలిసే ప్రేమ లచ్చమ్మ కు..పెండ్లి చేసుకున్నంక యిద్దరు పిల్లలు పుట్టినంక అరకొర జీతం నడుమ అగుపడే పెండ్లం లచ్చమ్మకు వున్న ట్రీట్మెంట్ ... ఆవేశంతోని ముచ్చట చెప్పుడు కు ఆలోచించి కష్టంతోని పనిచేసుడుకు తేడా వుంటదని... అట్లనే ఉద్యమం నడుపుతానప్పుడు ఆవేశం వేరు ప్రభుత్వాన్ని నడుపుతానపుడు ముఖ్యంగా తెలంగాణ అసొంటి కొత్త ప్రభుత్వాన్నికొత్త రాష్ర్టాన్ని ముందటికి తీస్కపోదలుసుకున్నప్పుడు వుండవలసిన ఆలోచన వేరు అని...అర్థమయింది.
2009 ల టిడిపీతోని పొత్తు పెట్టుకున్నప్పుడు గూడ కేసీఆర్ ను మస్తు తిట్టిండ్రు. కానీ.. అట్ల చేసుడే మంచిదయింది...బాబును తెలంగాణల యిరికిచ్చినట్లయింది..’’ అని తెలంగాణ వచ్చినంక అంటున్నరు.
మొన్న కేసీఆర్ వంటరిగ పోటీచేసినప్పుడు గూడ...‘‘ తెలంగాణ యిచ్చిన కాంగ్రేస్ కు ఓట్లెయ్యరా జనం.వాల్లతోని పొత్తు పెట్టుకోక..యీనెదో కత..’’ అని గులిగిండ్రు. కని యేమయింది.కేసీఆర్ కాలం నడుస్తాంది.
అట్ల చెప్పుకుంట పోతే శాన వున్నయి.మీకు యాదికొత్తే కశె కామెంటు పెట్టురి.
యింత యెపిసోడుల నాకర్థం కానిదేందంటే...కేసీఆర్ ను తిట్టెటోల్లంత.. యెన్నడు యెండ్ల కాంప్రమైజ్ కాలేదా.? మన గెట్టెమ్మటి శెల్కాయిన తోని యెన్ని సార్లు పంచాతి పెట్టుకోలే..యెన్ని పార్లు కలిసిపోలే..మనం మన పక్కింటోనితోని యెన్ని మాట్ల డుర్రి డుర్రి అని కాలుదువ్వలే...రొండు రోజులయినంక యింట్లె బాయిల నీల్లు వొడిస్తే బావ బావ అనుకుంట పోలేదా.? పాలిచ్చే బర్రెకు గడ్డికావాల్నని పంచాతి పెట్టుకున్నోడు మనకాడికి ఓ మోపు గావాల్నే అని రాలేదా.?
మన దోస్తు యెవడుండాల్నో మనం నిర్ణయించుకోగలం కానీ మన పక్కింటోడు యెవడుండాల్నో మనం నిర్ణయించుకోలేం గదా...రామోజీ మీద పగవట్టిన వైఎస్ యెన్నాల్లు కొట్లాడిండు మనకు తెల్వదా.? ఆఖరికి యేమయింది కత. యిప్పుడు మనది కొత్త ప్రభుత్వం..మందితోని పంచాది పెట్టుకుందామా.? మన పాలనను గాడిల యేసుకుందానా.? మొన్నగాక మొన్న మనోల్లు యేమన్నరు ..యేందే కొత్త రాష్ర్టం వచ్చినప్పుడు కేంద్రంల వున్నోల్లతోని మంచిమాటగ వుండాలె కానీ పంచాతి పెట్టుకుంటారే..’’ అని కేసీఆర్ మీద యెగరలే.. ఆల్లే యియాల రామోజీతోని మంచిమాట చేసుకోబోతె కస్సుమంటున్నరు. లక్ష నాగండ్లతోని దున్నతమని యెందుకు దున్నరు.? అని అడిగెటోల్లకు యేం జెప్పాలె..ఉత్సబోషే కాడ యేందో దొరికిచ్చుకున్నట్టు..అయన్ని యిప్పుడయితయా.? మనుసు ప్రశాంతం చేసుకోని ఆలోచించుకుంటే మంచిదేమో ననిపిస్తాంది నాకయితే..నిజంగా అట్ల రామోజీని ఆగమాగం చేసుడుగానీ..బెదిరిచ్చుడు గానీ..భూములు గుంజుకునుడు గానీ అయితదా.?అప్పుడు యింకెంత రాద్దాంతం చేస్తరు.యిప్పటికే పగపట్టి యిట్ల వన్నరు ఒక్కొక్కడు.రామోజీని పొగుడుతార్కే ఆల్ల నోట్లె గూడ పచ్చి యెలక్కాయె పడ్డట్టే. చంద్రబాబు రాధాక్రుష్ణ అందరు కూడ బలుక్కోనే యిదంత నడుత్తాందని విప్లవకారులంటరు గని అంత వేస్టు ముచ్చెట.
రామోజీ అనేటోడు వుత్త మనిషికాదు..ఆయన మూలాలు బలమైన కులం ల వున్నయి...అటు టిడిపీ తోటి యిటు బీజేపీ తోటి బలమైన బంధం వున్నది . ఢిల్లీల సూల్లేదా ... రాజగురువుకు మోడీ యెంతగ మర్యాద యిచ్చిండో..అయితే ఆయనేందో గొప్పోడని కాదు గని, బలమైన శత్రువు అనేది మాత్రం గుర్తించాలె.అసొంటోన్ని లొంగదీసుకోవడమో లొంగిపోయేలాగ చేయడమో యేదో ఓటి చేయాలె. యేం చేసినా మనదే పై చేయి వుండాలె.‘‘రామోజీరావు కేసీఆర్ ను కలుద్దానికి పదిమాట్ల అపాయిట్మెంట్ అడిగిండట...యిస్తే యెంబోతాంది’’ అని అన్నరు.ఆల్లే యిప్పుడు తప్పు పడుతున్నరు.తెలంగాణ ముఖ్యమంత్రి యిప్పుడు పిల్లల కోడి అన్నిటిని కాపాడుకోవాలె. సీదీ వుమ్లీసే ఘీ నహీ నికల్తీ..’’ ముల్లు ను ముల్లు తోనే తీయాలె...కమ్మను కమ్మతోనే కోయాలె’ నేమో..సూద్దాం..
కాలిలోని ముల్లు కంటిలోని నలుసు... అన్నట్లు శత్రు శేషం యెక్కువ రోజులుండనీయవద్దు. మావోను నమ్మినోల్లకు తప్పితే రామోజీరావు యెవలకి వర్గ శత్రువు కాదు. మెయిన్ స్ర్టీం పాలిటిక్స్ ల శాశ్వత శత్రుత్వం వుండదు.పార్టీలు నడుపాలంటే అంత అల్కటిపనికాదు.అంతెందుకు .. తెలంగాణ రాకముందల సిపిఎం అనే పార్టీ జై సమైక్యాంధ్ర అనలేదా.? అదే పార్టీ యిప్పుడేమంటాంది..తప్పదు. కాలం అన్ని రోజులు మనతోని నడువదు. తెలంగాణ యియ్యకముందు సోనియాను మనం యేమన్నం.? యిప్పుడు దేవత అని కొలుస్తలేమా.? కాల చిత్రం.యేదీ నిర్థిష్టం కాదు.అభిప్రాయాలు అనేవి బిడసగట్టుకునేయి కావు.అవి బాహ్య పరిస్తితులకు గీటు రాయి వంటివి.(ముఖ్యంగ రాజకీయాలల్ల) ఒకప్పుడు నై తెలంగాణ అన్న తలసాని తుమ్మల గిట్ల యియ్యాల జై తెలంగాణ అంటున్నరు..మరేం జేద్దాం.?
ఉద్యమకారులకు అవకాశాలియ్యవచ్చుకదా..వీల్లను యెందుకు తీసుకోవాలె.? అనేది మనకున్న మరో కోపం. ఉద్యమకారులుగూడ మంచోల్లే గానీ వీల్లేమో రాజకీయాలకు కొత్త.. అసొంటిది ప్రభుత్వంల కటర్ పంత్ ఉద్యమ కారులకు అవకాశమిస్తే ఆల్లు లైన్ల పడుతరా.? అనుమానం.అధికారం చలాయించుడు అంత యీసీకాదు...అవసరాన్ని బట్టి అనుకువగా వుండాలె...ఆధిపత్యం చేయాలె. అందుకే ... ‘‘నాయకత్వం అంటే యెదిగివుండడం మాత్రమే కాదు..యెక్కడ ఒదిగి వుండాల్నో తెలుసుకోవడమే..’’...
అయినా ముఖ్యమంత్రిగా కత నడిపిచ్చుడంటే అంత వీజీకాదు.. యిదోరకు కేసీఆర్ నిర్ణయాలను చానా చూసినం.. అయిటంక ఆయనే కరెట్టన్నం. మన మనుసుకు నచ్చినట్లే యెదుటోడు నడువాల్నంటే...కల్తదా..అందుల కొత్త తెలంగాణ కొత్త ప్రభుత్వం ఆగమాగం కావద్దు..అయినా ప్రభుత్వ నిర్ణయాలను కింది స్తాయికి తీస్కపోయే యంత్రాంగం సరిగ్గ పనిచేత్తాందా లేదా సూద్దాం...మనం ఆ పని మీద పడుదాం.
మర్సిపోయిన..మొన్న రాజకీయ నాయకుడుగా మారిన ఉద్యమకారుడు నన్ను సెక్రటేరియట్ల వూకెనే తిరుగుతాంటే పట్టుకోని తిట్టుడు మెదలు పెట్టిండు...‘‘ యేందన్నా నువ్వు నాకర్ధం కాదు.నువు మామూలు కష్టం చేసినావె...తెలంగాణకోసం.అరెరె ఉద్యమ సంఘాలన్నీ నీ మీడియా సెంటర్లనే తిరిగినయ్. ఢిల్లీల నువ్వు చేసిన పని మామూలుదానే..నువ్వు యిట్ల తిరుగుడు యేం బాగలేదన్నా..’’ అన్నడు.మరి యేం చేయాలె.? అని నేనడిగిన. అంటే...‘ యేం చేయాలె.? నేను కరెక్టుగ మూడు నెల్లసంది తిరుగుతాన...సారుకాడికి.యిగో యియ్యాల కుదిరింది పరిస్తితి నాకు పదవి యియ్యడానికి..యేదయినా గంతేనే అడగంది అమ్మయినా బువ్వ పెట్టదే...’’ అన్నడు. ‘‘ యేమో పోవే..అయన్నీ మనకు అల్వాటు లేకపాయె.. సూద్దాం..’’ అన్న.అయినా నాకు జర్నలిస్టుగ వుండుడే యిష్టం..అని చేతగాని ఫోజులు కొట్టిన. అంటే గట్టనే వుంటది. మనసు గట్టిగ చేసుకోని యిసొంటి కతలన్నీ అలవాటు చేస్కోవాలెనేమో...అని అనిపిచ్చింది నాకు.అయితదా.? యేమో సూద్దాం..
.


No comments:

Post a Comment