Monday 19 January 2015

దేశంలో సక్రమ సెన్సారింగ్‌ వ్యవస్థ కొల్లబోయిందనడానికి

సెన్సార్‌ లీల!
======================
అయిదు నెలల క్రితం ముఖ్య కార్యనిర్వహణాధికారి భారీ అవినీతి బాగోతంతో తీవ్ర అప్రతిష్ఠ పాలైన కేంద్ర సెన్సార్‌ బోర్డు, తాజాగా మళ్ళీ పత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. వివాదాస్పద మత గురువు గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రంపై రేగిన రగడ కేంద్ర బిందువుగా, బోర్డు సభ్యుల మూకుమ్మడి రాజీనామాలు సంచలనం సృష్టిస్తున్నాయి. చిత్రం విడుదలను నిలువరించేందుకు సెన్సార్‌ బోర్డు యత్నించగా, ఎఫ్‌సీఏటీ (ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌) ఆ నిర్ణయాన్ని తిరగదోడింది. అందుకు నిరసనగా బోర్డు ఛైర్మన్‌ లీలాశామ్సన్‌ చేసిన రాజీనామాను కేంద్రప్రభుత్వం ఆమోదించడం తరువాయి, మరో 12మంది సభ్యులూ నిష్క్రమణ బాట పట్టారు. తమ సామూహిక రాజీనామాలకు వెలుపలి జోక్యం, అవినీతి, ఒత్తిళ్లను కారణాలుగా వారు పేర్కోవడం అసలైన విడ్డూరం! షర్మిలా టాగూర్‌ పదవీ వారసురాలిగా 2011లో లీలాశామ్సన్‌ నియామకానికి కొన్నేళ్లముందే, సర్వోన్నత న్యాయస్థానం సెన్సారింగ్‌పై చరిత్రాత్మక తీర్పిచ్చింది. ఎవరో వూరేగింపులు తీస్తారని, వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహిస్తారనీ బెదిరి భావప్రకటన స్వేచ్ఛను బలిపీఠంపైకి నెట్టడం సరికాదన్న సుప్రీంకోర్టు- ఒక చిత్రం గుణదోషాలను పరిశీలించేటప్పుడు లోకజ్ఞానం కలిగిన సామాన్యులు పాటించే ప్రమాణాలే సెన్సార్‌బోర్డుకూ అనుసరణీయాలని స్పష్టీకరించింది. ఆ స్ఫూర్తికి అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ గొడుగు పట్టడాన్ని 'వెలుపలి జోక్యం'గా లీలాశామ్సన్‌ భాష్యం చెప్పడమే కాదు, మునుపెన్నడెరుగని రాద్ధాంతానికి మూలహేతువయ్యారు. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ మాటల్లో- అవినీతి ఆరోపణలకు, యూపీఏ జమానాలో నియమితులై ఇంతకాలం కొనసాగిన బోర్డు సభ్యులే బాధ్యులు. అమాత్యుల వివరణాత్మక స్పందన, బోర్డుకు నిధుల కొరతపై తిరుగుబాటు సభ్యుల ఫిర్యాదులకు గాలి తీసేసింది. అనూహ్య రాజీనామాల నేపథ్యంలో, సెన్సార్‌బోర్డు సత్వర పునర్‌ వ్యవస్థీకరణకు చురుగ్గా కదలడంతోపాటు- అవినీతి ఆరోపణలపై సుప్రీం మాజీ న్యాయమూర్తితో సమగ్ర విచారణకూ కేంద్రం ఆదేశించాలి!
స్వీయ 'పదవీత్యాగా'నికి అవినీతినొక కారణంగా గౌరవ సభ్యులు ప్రస్తావించడం, సెన్సార్‌ బోర్డు స్వతంత్ర ప్రతిపత్తిపై ప్రభుత్వం దాడికి పాల్పడిందని విపక్షం గళమెత్తడం- పస లేని వాదనలు. అజయ్‌ దేవ్‌గణ్‌, సల్మాన్‌ ఖాన్‌ ఇటీవలి చిత్రాల విడుదల కోసం ఆయా దర్శక నిర్మాతలు సెన్సార్‌ బోర్డు కార్యాలయాన్ని 'ప్రత్యేకంగా' దర్శించుకోవాల్సి వచ్చిందని యావత్‌ బాలీవుడ్‌ పరిశ్రమకు తెలుసు. అటువంటి బాగోతాలెన్నింటినో కప్పిపుచ్చి ఎదుటివారిమీద బురద జల్లే కుటిల యత్నాల లోగుట్టు ఎవరికైనా ఇట్టే బోధపడుతుంది! సెన్సార్‌ బోర్డులో విశృంఖల రాజకీయ జోక్యానికి యూపీఏ జమానా పెట్టింది పేరు. మునుపటి ప్రభుత్వం నియమించిందన్న ఏకైక కారణంతో బోర్డు సారథ్య బాధ్యతల నుంచి అనుపమ్‌ ఖేర్‌ను 2004లో అర్ధాంతరంగా తప్పించిన మన్మోహన్‌ సర్కారు, ఆయన స్థానే షర్మిలా టాగూర్‌ను కొలువు తీర్చింది. ఛైర్మన్‌గా తనకేమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా యూపీఏ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు షర్మిల నిప్పులు కక్కారు. రాజకీయ నియామకాల మూలాన సెన్సారింగ్‌ వ్యవస్థే నిస్సారంగా మారిపోయిందనీ సారథి హోదాలో ఆమె ఆగ్రహం వెళ్ళగక్కారు. అధికారం దఖలుపడగానే పాత నియామకాలకు చెల్లుకొట్టకుండా ఇన్నాళ్లూ సంయమనం వహించిన మోదీ ప్రభుత్వానికిప్పుడు బోర్డు ప్రక్షాళనకు అవకాశం అందివచ్చినట్లయింది. పార్లమెంటు సభ్యులో, దిల్లీ స్థాయిలో పలుకుబడి కలిగిన నాయకులో సిఫార్సు చేస్తేచాలు- సెన్సార్‌ బోర్డు సభ్యులుగా అయోగ్యులూ కుదురుకోవడం ఏళ్లతరబడి చూస్తున్నాం. అందుకు విరుద్ధంగా, ప్రస్తుత ఎంపీలను దూరంపెట్టి- సినీ పరిశ్రమతో అనుబంధం, చలన చిత్రాల పట్ల మమకారం కలిగిన అర్హులకే ఎంపికలో పెద్దపీట వేయడానికి కేంద్రం మొగ్గుచూపడం శుభ పరిణామం.
దేశీయ సెన్సారింగ్‌ విధానానికి 1920లో ఆంగ్లేయులు దిద్దిన ఒరవడే మాతృక. బ్రిటిష్‌ పాలకులు వండివార్చిన చట్టాలకే 1952లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేశారు. దానికే అడపాదడపా సవరణల మాట్లు వేస్తున్నారు. సామాజిక మార్పులకు సానుకూలంగా స్పందించాలని, కాలానుగుణంగా వ్యవహార సరళి మార్చుకోవాలని కేంద్ర, ప్రాంతీయ సెన్సార్‌ బోర్డులకు సర్వోన్నత న్యాయస్థానం 1989లోనే పిలుపిచ్చింది. ఇన్నేళ్లలో మెరుగుదల మాట దేవుడెరుగు, పోనుపోను క్షీణ ప్రమాణాలు ముమ్మరిస్తున్నాయి. తమ చిత్రాలకు త్వరగా అనుమతి రాకపోతే పెద్దయెత్తున నష్టపోతామన్న నిర్మాతల భయమే సెన్సార్‌ బోర్డులో 'ధరల' నిర్ణాయకాంశమని, న్యాయస్థానం ఎదుట కేదస (సీబీఐ) ఇచ్చిన వాంగ్మూలం- వూడలు దిగిన అవినీతికి నిలువుటద్దం. స్థానిక భాష రాని, తెలియని ప్రబుద్ధులూ, ప్రాంతీయ సెన్సార్‌ బోర్డుల్లో చక్రం తిప్పుతున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒకోవిధంగా వంకర్లు పోతున్న నిబంధనల దన్నుతో, ముడుపుల సాయంతో చలాయించుకుంటున్న వాళ్లకు అడ్డేలేదు. అసభ్య, అవాంఛనీయ దృశ్యాలు, ద్వంద్వార్థాల పాటలు, రోత డైలాగులు కలిగిన చిత్రాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. దేశంలో సక్రమ సెన్సారింగ్‌ వ్యవస్థ కొల్లబోయిందనడానికి ఇంతకన్నా వేరే దృష్టాంతాలు అక్కర్లేదు. సెన్సారింగ్‌ బాధ్యతలు చేపట్టేవారికి సినిమా, సౌందర్య శాస్త్రం, కళారంగాల నేపథ్యం కొంతైనా ఉండాలన్న ముద్గల్‌ కమిటీ- సలహా సంఘం సభ్యులుగా మీడియా, సినిమా తదితర రంగాలకు చెందినవారినే ఎంచుకోవాలనీ సిఫార్సు చేసింది. పరోక్షంగా సర్కారీ పెత్తనంలో సాగుతున్న సెన్సార్‌ బోర్డుల సాకల్య క్షాళనకు జస్టిస్‌ జి.డి.ఖోస్లా కమిటీ నాలుగున్నర దశాబ్దాల క్రితమే గట్టిగా ఓటేసింది. ఇన్నేళ్ల పాలకుల అలక్ష్యం సెన్సారింగ్‌ వ్యవస్థను నిలువెల్లా భ్రష్టు పట్టించింది. పారదర్శక నియామకాలు, జవాబుదారీ పనితీరుకు దోహదపడే మేలిమి సంస్కరణలకు నరేంద్ర మోదీ ప్రభుత్వమే నడుం బిగించాలి!
_________________________________
సౌజన్యం: ఈనాడు దినపత్రిక సంపాదకీయం (19-01-15)

No comments:

Post a Comment