smile emoticon
ఒకరు 40 ఏళ్లుగా తెలుగువారిని అలరిస్తున్న సూపర్ కమెడియన్, ఇంకొకరు 30 ఏళ్లకు పైబడి యావద్‌భారతదేశాన్నీ, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయులందరినీ అలరిస్తున్న సూపర్ కమెడియన్. వీళ్లిద్దరికీ సత్తెనపల్లితో వున్న స్ట్రాంగ్ కనెక్షన్ గురించి ఈ చిన్న పోస్టు.
కన్నెగంటి బ్రహ్మానందాచారి ఉరఫ్ బ్రహ్మానందం సొంతవూరు సత్తెనపల్లికి 15 కి.మీల దూరంలోని ముప్పాళ్ల. సత్తెనపల్లి 'ప్రగతి కళామండలి' సంస్థ వెన్నుదన్నుతో మిమిక్రీ కళాకారుడిగా జన్మ తీసుకున్నారు. ప్రగతి కళామండలి వ్యవస్థాపకులు పత్రి జగన్నాథరావు గారు, వెంకట్రావు గారు తదితరుల సాయంతో కళాకారుడిగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'పకపకలు' కార్యక్రమంతో దూరదర్శన్ ద్వారా యావదాంధ్రకూ పరిచయమయ్యారు, చాలాకాలంపాటు దూరదర్శన్‌లో ఆ ఫీచర్ నడిచిన విషయం మీలో చాలామందికి గుర్తుండేవుంటుంది. అనంతరం అత్తిలి కాలేజీలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తూ సినిమారంగంలోకి ప్రవేశించారు. వెయ్యికి పైగా సినిమాలు చేసిన బ్రహ్మానందం 1987లో సినిమారంగ ప్రవేశం చేసిననాటినుంచీ ఈనాటి దాకా (1996, 2000, 2001 సంవత్సరాలు మినహాయించి) ప్రతి ఏటా నందిఅవార్డుల్లో స్థానం సంపాదించుకుంటూనేవచ్చారు. ఆయన కెరియర్ మొత్తం సత్తెనపల్లి తోనే ముడిపడివుంది.
జానీలీవర్ అని హిందీ సినిమా ప్రేమికులు ఆప్యాయంగా పిలుచుకునే 'జనుముల జాన్ ప్రకాశరావు' ప్రకాశం జిల్లా కనిగిరిలో పుట్టారు. తండ్రి హిందూస్తాన్ లీవర్ కంపెనీ (ముంబాయి)లో ఉద్యోగి. తండ్రి కంపెనీలో ఒక కార్యక్రమంలో ప్రముఖుల్ని ఇమిటేట్ చేస్తూ "జానీ ఆఫ్ లీవర్ జానీ లీవర్" అని బిరుదు సంపాదించుకున్నారు, అదే ఆయన సినిమా పేరుగా స్థిరపడింది. కుటుంబం ఆర్థికంగా అనేక కష్టనష్టాలు అనుభవించిన సమయంలో జానీలీవర్‌ను సత్తెనపల్లికి చెందిన ఆయన మిత్రులు ఆదుకున్నారు. ఆయన స్నేహితుడు, శరభయ్య హైస్కూల్ కరస్పాండెంట్ వెలుగూరి విజయ వెంకట లక్ష్మీనారాయణ జానీలీవర్ కళాకారుడిగా ముంబయిలో స్థిరపడడానికి ఎంతో సాయపడ్డారు. ఇవ్వాళ్టికీ చాలా తరచుగా జానీలీవర్ సందర్శించే రెండు తెలుగు ప్రాంతాలు కనిగిరి, సత్తెనపల్లి మాత్రమే. జానీలీవర్‌కూ సత్తెనపల్లిలో మంచి మిత్రులున్నారు. తన కెరియర్‌కి సత్తెనపల్లి చాలా సాయపడిందని అనేక సందర్భాల్లో జానీలీవర్ చెప్పారు.
బ్రహ్మానందం ఒకేఒక్క హిందీ చిత్రం 'వెల్‌కమ్‌బాక్'లో చేస్తే, జానీలీవర్ ఒకేఒక్క తెలుగు చిత్రం 'క్రిమినల్' (మహేష్‌భట్)లో చేశారు.
ఇలా సత్తెనపల్లి ఇద్దరు మహా కళాకారులకు కళాకారులుగా జన్మనిచ్చింది. ఇదీ జానీలీవర్, బ్రహ్మానందాలకు సత్తెనపల్లితో వున్న సంబంధం కథ. కథ సత్తెనపల్లికీ, మనం ఇంటికీ.
No comments:
Post a Comment